సాఫీగా మహాగణపతి నిమజ్జనం
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం సాఫీగా పూర్తయ్యింది. ఎన్టీఆర్ మార్గ్‌లో 4వ నెంబర్ క్రేన్ వద్ద భారీ గణపతి నిమజ్జనం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయబడింది. 350 టన్నుల బరువు ఎత్తగలిగే సూపర్ క్రేన్‌ను శంషాబాద్ నుండి తీసుకువచ్చారు. ఈ ఉదయం ప్రారంభమైన మహా గణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్రకు నగరం నలుమూలల నుండి భక్తులు పోటెత్తారు. యువకులు ఆనందోత్సాహాలతో ఆడుతూ వినాయకుని గంగమ్మ ఒడికి తీసుకువెళ్లారు. మహిళలు, యువతులు నృత్యాలు చేస్తూ, యువత సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా సాగింది ఈ శోభాయాత్ర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్రలో పాల్గొన్నారు.

