మంత్రివర్గంలో స్వల్ప మార్పులు… వైఎస్ జగన్ అడుగులు ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరికొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని ఆలోచనలతో మంత్రివర్గంలో స్వల్ప మార్పులు దిశగా అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్ లో కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన జగన్ రాబోయే ఎన్నికల వరకు ఇదే మంత్రి వర్గం పనిచేస్తుందని స్వయంగా చెప్పారు. అయితే వారిలో కొంతమంది సీఎం జగన్ సూచించిన విధంగా ఎన్నికల వేగాన్ని అందుకోలేకపోవటం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం తదితర కారణాలు వలన నాలుగో లేదా ఐదుగురు మంత్రులను తొలగించి ఆస్థానాల్లో కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబోతున్న వారికి ఇస్తారని ప్రచారం జోరుగా జరుగుతుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల తర్వాత జగన్ కచ్చితంగా తన క్యాబినెట్లో మార్పు చేర్పులు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలోనే సీఎం జగన్ శాసన మండలి నుండి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అయితే వారిద్దరికీ తర్వాత రోజుల్లో రాజ్యసభలో అవకాశం కల్పించి ఢిల్లీకి పంపారు. దీంతో మండలి నుండి జగన్ క్యాబినెట్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న మండలి ఎన్నికలకు సంబంధించి మార్చి 16వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి.ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేపట్టే క్రమంలో మండలి నుండే సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని జగన్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో 23 స్థానాలకు సంబంధించి మూడు ఉపాధ్యాయ, రెండు పట్టభద్రులు 9 స్థానిక సంస్థల కోటాతో పాటుగా, ఏడు ఎమ్మెల్యే, రెండు గవర్నర్ కోటాలో నామినేట్ చేయనున్నారు. ఆయా స్థానాలకు సంబంధించి మార్చి 29 మే ఒకటో తేదీతో ప్రస్తుత ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగియనుంది. కొత్తగా గెలుపొందే వారు ఆ తర్వాతే ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మండలి ఫలితాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేపడతారా లేక ఎమ్మెల్సీలు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మార్పుల చేర్పులకు నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.