నన్ను ఓడించడానికి స్కెచ్ వేసి, చిల్లర వేషాలతో గెలిచారు…ఈటల
తనను ఓడించాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీ స్కెచ్ వేసి, చిల్లర వేషాలతో గెలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. జమ్మికుంట, ఇళ్లందకుంట మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కడి కార్యకర్తల కుటుంబాలతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు ఈటల. 2008లో 2010లో తాను రాజీనామా చేశానని, కానీ ఇక్కడి ప్రజలే చందాలు వసూలు చేసుకుని తనను గెలిపించారని పేర్కొన్నారు. తాను ఎక్కడ పెళ్లయినా, ఎక్కడ మరణాలు జరిగినా వస్తానని పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నా, లేకపోయినా తనకు పెద్ద తేడాగా ఉండదని చెప్పారు. ఈ హుజూరాబాద్ నియోజక వర్గంలో తనకు అలాంటి ఇబ్బంది ఎప్పుడూ లేదన్నారు. తన పనులు ఏ పార్టీ వాళ్లైనా చేసి పెట్టేవారన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా, తన మాటకు కట్టుబడి ఈ నియోజక వర్గానికి అధిక పవర్ గల విద్యుత్ సబ్ స్టేషన్ శాంక్షన్ అయ్యిందన్నారు. తనకు ఇది ఓట్లేసిన గ్రామమని, ఓట్లేయని గ్రామమని తనకు తేడాలు లేవన్నారు. 2021 వరకూ అలాగే జరిగిందన్నారు. కానీ ఆతర్వాత 2021లో తాను గెలిచిన తర్వాత ఈ నియోజక వర్గంపై కక్ష కట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇక్కడి అభివృద్ధిని నాశనం చేశారన్నారు. ఈటల రాజేందర్ వంటి వారిని కొట్టాలంటే స్కెచ్ వేసుకుని, సైకో లాంటి వ్యక్తిని పెట్టి, చిల్లర వేషాలు వేశారన్నారు. ఇళ్లిస్తాం, కమ్యూనిటీ హాల్స్ ఇస్తాం అని మభ్యపెట్టి ప్రజల ఓట్లు సాధించారన్నారు. కేవలం హుజూరాబాద్‌లోనే కాదు, గజ్వేల్‌లో కూడా ఇంత కంటే ఎక్కువే ప్రజలను ప్రలోభపెట్టారని పేర్కొన్నారు.

నేడు నేను ఎమ్మెల్యేను కాకపోయినా, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికి పోయినా, నన్ను గుర్తుపట్టి ‘బాగున్నావా బిడ్డా?’ అని ఆప్యాయంగా పలకరిస్తారని అది చాలని పేర్కొన్నారు. ‘నువ్వు లేని శాసన సభను చూడలేకపోతున్నాం’ అని ఆశావర్కర్లు, అంగన్ వాడీ ఆయాలు, వీఆర్‌ఏలు విచారం వ్యక్తం చేస్తున్నారన్నారు. జమ్మికుంట మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం జీతాలు ఇచ్చినా, ఇవ్వలేకపోయినా తాను అండగా ఉంటానన్నారు. నాడు 1700 మంది కార్మికులను ఉద్యోగం నుండి తొలగిస్తే, తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కూడా మంత్రి పదవి పోయినా పరవాలేదనుకుని వారికి అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. 2021లో తనను గెలిపించినందుకు తన మనుషులను, కార్యకర్తలను ఎంతగానో హింసలు పెట్టారన్నారు. ప్రజలను ఇంత క్షోభ పెట్టిన ప్రభుత్వాన్ని వారు క్షమించలేదని, అందుకే కేసీఆర్‌కు తగిన శాస్తి చేశారన్నారు. తాను కారు దిగిన దగ్గర నుండి, తిరిగి కారు ఎక్కేంతవరకూ తనను భుజాలపైన మోసారని, వారిని ఎప్పుడూ మరిచిపోనన్నారు. తెలంగాణలో 30 ఏళ్లుగా నానుతున్న బీసీల వర్గీకరణ సమస్యను తేలుస్తానని ప్రధాని మోదీ మాటిచ్చారన్నారు. తాను ఏ పదవైనా, కొనుక్కుంటే వచ్చేది కాదు.. ప్రజలు ఆశీర్వదించి ఇస్తేనే, వస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తల బలం ఉంటేనే, ప్రజల ఆశీర్వాదం ఉంటేనే గెలుస్తామని పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకూ 20 ఎన్నికలలో పాల్గొన్నానని, కార్యకర్తలు, స్థానిక నాయకులు పట్టుపట్టి, జట్టు కడితే సాధించలేనిది లేదని పేర్కొన్నారు. ఇది తాను ప్రత్యక్షంగా అనుభవించానని తెలియజేశారు. తనను గెలిపించినందుకు, తెలంగాణ ఉద్యమంలో హుజూరాబాద్ పాత్రను తెలంగాణ వ్యాప్తంగా గుర్తించేలా చేశానన్నారు. గత ప్రభుత్వం ఎంత నీచంగా కుట్రపన్నిందంటే, ఒక్క ఎమ్మార్వోను కూడా తనను కలవనివ్వలేదని మండిపడ్డారు. తనను కలిసిన అధికారులను సస్పెండ్ చేయడమో, బదిలీ చేయడమో చేశారన్నారు. తనకు పార్టీతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తానని ప్రమాణం చేశారు. తనవల్ల అయ్యే పనులు చేస్తారన్నారు.

