Breaking Newshome page sliderHome Page SliderNationalNews

భారత్ లోనే SJ-100 విమానాల తయారీ

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దేశ విమానయాన చరిత్రలో మరో కీలక మైలురాయిని నమోదు చేసింది. ప్రయాణికుల విమానాల ఉత్పత్తి రంగంలో తిరిగి అడుగుపెట్టింది . రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ తో హెచ్ఏఎల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా రాజధాని మాస్కోలో మంగళవారం ఈ ఎంఓయూపై సంతకాలు జరిగాయి. హెచ్ఏఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డీకే సునీల్, యూఏసీ డైరెక్టర్ జనరల్ వాదిమ్ బదేకా సమక్షంలో ఇరు సంస్థల ప్రతినిధులు ప్రభాత్ రంజన్, ఒలేగ్ బొగోమొలోవ్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ భాగస్వామ్యంతో భారత్‌లో SJ-100 సివిల్ కమ్యూటర్ ప్యాసింజర్ విమానాల తయారీ ప్రారంభం కానుంది. రాబోయే సంవత్సరాల్లో దేశీయంగా విమానయాన రంగానికి ఇది పెద్ద ఊతం అందించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఒప్పందం దేశంలో సుమారు మూడు దశాబ్దాల తర్వాత ప్రయాణికుల విమానాల ఉత్పత్తి పునఃప్రారంభం అవుతుందని పేర్కొంది. చివరిసారిగా హెచ్ఏఎల్ 1961–1988 మధ్య ఆవ్రో హెచ్‌ఎస్748 (AVRO HS748) విమానాలను తయారు చేసింది.

SJ-100 అనేది రెండు ఇంజిన్లు కలిగిన నారో-బాడీ జెట్‌, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 16 కమర్షియల్ ఎయిర్‌లైన్స్ సంస్థలు 200కు పైగా ఈ తరహా విమానాలను నడుపుతున్నాయి. కొత్త ఒప్పందం ప్రకారం, ఈ విమానాలను తయారు చేసే హక్కులు భారతీయ సంస్థ హెచ్ఏఎల్‌కు లభించనున్నాయి.

హెచ్ఏఎల్ అధికారులు ఈ ప్రాజెక్ట్‌ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ దృష్టికోణానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఉడాన్ పథకం కింద దేశంలోని చిన్న పట్టణాలు, ప్రాంతీయ కేంద్రాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఈ విమానాలు గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తాయని హెచ్ఏఎల్ విశ్వాసం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం భారత విమానయాన రంగంలో వచ్చే దశాబ్దంలో కనీసం 200 కొత్త ప్రాంతీయ విమానాల అవసరం ఉంటుందని అంచనా. అదనంగా, హిందూ మహాసముద్ర పరిధిలోని పర్యాటక ప్రాంతాలకు సేవలందించేందుకు మరో 300–350 విమానాలు అవసరమవుతాయని అంచనాలు చెబుతున్నాయి.
దేశంలో ప్రయాణికుల విమానాల తయారీ రంగం మళ్లీ చురుకుగా మారే సూచనల మధ్య, హెచ్ఏఎల్–యూఏసీ భాగస్వామ్యం భారత విమానయాన పరిశ్రమకు ఒక చారిత్రక మలుపుగా భావించబడుతోంది.