ఇంగ్లండ్ కి చుక్కలు చూపించిన సిరాజ్..
బర్మింగ్ హామ్ రెండో టెస్టులో 6 వికెట్లు తీసిన సిరాజ్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లకి చుక్కలు కనిపించాయి. అనూహ్య రీతిలో ఇంగ్లాండ్ 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక భారత బౌలర్లు ప్రత్యర్థిని చుట్టేస్తారని అనుకుంటే ఆటతో జేమీ స్మిత్, బ్రూక్స్ భారీ శతకాలు బాదేశారు. పరుగుల అంతరాన్ని కరిగించేస్తూ కంగారు పెట్టారు. గిల్ సేన పట్టుకోల్పోతుందేమో అనుకుంటున్న స్థితిలో.. ఆఖరి సెషన్లో సిరాజ్, ఆకాశ్ దీప్ విజృంభించి జట్టును మళ్లీ మ్యాచ్ ని అదుపులోకి తీసుకొచ్చారు. భారత్ కు 180 పరుగుల ఆధిక్యాన్ని సాధించిపెట్టారు. రెండో ఇన్నింగ్స్ లో స్థిరంగా ఆడుతున్న టీమ్ ఇండియా మొత్తంగా 244 పరుగుల ముందంజలో నిలిచింది. ఇప్పటికే మెరుగైన స్థితిలో ఉన్న భారత్ నాలుగో రోజు జోరు కొనసాగిస్తే మ్యాచ్ గుప్పెట్లోకి తెచ్చుకున్నట్లే! రెండో టెస్టులో భారత్ (India vs England) బలమైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ను 407 పరుగులకు ఆలౌట్ చేసి 180 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న శుభ్ మన్ సేన.. మ్యాచ్ పై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యాన్ని అందుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడింది. యశస్వి జైస్వాల్, రాహుల్ పోటీపడి షాట్లు ఆడడంతో భారత్ 7.3 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. ఈ స్థితిలో యశస్వి (28; 22 బంతుల్లో 6×4)ను టంగ్ ఎల్బీగా ఔట్ చేశాడు. మూడో రోజు, శుక్రవారం ఆట చివరికి భారత్ రెండో ఇన్నింగ్స్ 64/1తో నిలిచింది. రాహుల్ (28), కరుణ్ నాయర్ (7) క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు జేమీ స్మిత్ (1841 నాటౌట్; 207 బంతుల్లో 21×4, 4×6), హ్యారీ బ్రూక్ (158; 234 బంతుల్లో 17×4, 1×6) భారీ శతకాలతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 407 పరుగులు చేసింది. సిరాజ్ (6/70), ఆకాశీప్ (4/88) ప్రత్యర్థిని కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 587 పరుగులు చేసింది. బుమ్రా లేకపోవడంతో టీమిండియా బలహీనపడుతుందేమో అని ఆశించిన ఇంగ్లండ్ కి సిరాజ్ కంగుతినిపించాడు. సిరాజ్ మాట్లాడుతూ.. “ఈ క్షణాల కోసం చాన్నాళ్లుగా వేచి చూస్తున్నా. గతంలోనూ చాలా బాగా బౌలింగ్ చేసినా వికెట్లు దక్కలేదు. ఇప్పుడు ఆరు వికెట్లు తీయడం చాలా స్పెషల్. పిచ్ చాలా మందకొడిగా ఉంది. పేస్ ఎటాకు లీడ్ చేసే బాధ్యత ఉన్నప్పుడు… మరిన్ని ప్రయోగాలకు వెళ్లలేదు. సరైన ప్రాంతాల్లో బంతిని విసిరి ఫలితం రాబట్టేందుకు ప్రయత్నించా. మరిన్ని పరుగులు ఇవ్వకూడదనే లక్ష్యంతోనే బౌలింగ్ చేశా. బుమ్రా లేకుండా బౌలింగ్ చేయడం సవాలే. ఆకాశ్ దీప్, ప్రసిద్ధ కృష్ణకు ఎక్కువ అనుభవం లేదు. అందుకే, ప్రత్యర్థిపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురావాలని దృష్టిపెట్టా. బుమ్రా లేనప్పుడు ఆ బాధ్యత తీసుకోవాలి. నాకు సవాళ్లను స్వీకరించడం చాలా ఇష్టం” అని సిరాజ్ వెల్లడించాడు.