Home Page SliderNational

డేటింగ్ వార్తలపై స్పందించిన సిరాజ్

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఓ బాలీవుడ్ సింగర్ తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ముంబైలోని బాంద్రాలో జరిగిన బాలీవుడ్ సింగర్ జనై భోస్లే 23వ జన్మదిన వేడుకల్లో సిరాజ్ పాల్గొన్నాడు, ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టా లో పోస్ట్ చేయడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. ఆ ఫోటోలలో సిరాజ్, జనై చాలా సన్నిహితంగా కనిపించడంతో వీరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని భావించిన సిరాజ్ వెంటనే స్పందించాడు. తమపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. జనై తనకు సోదరి లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇన్ స్టా లో ఒక పోస్ట్ పెట్టాడు. “ఆమె లాంటి సోదరి నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నేను ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లుగా, ఆమె వెయ్యి మందిలో ఒకరు” అంటూ కవితాత్మకంగా రాసుకొచ్చారు. మరోవైపు జనై కూడా ఈ పుకార్లపై స్పందిస్తూ, సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడని పేర్కొన్నారు. జనై భోస్లే గురించి ప్రతి ఒక్కరూ ఆమె ఎవరు అని ఆరా తీస్తున్నారు. ఆమె లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు.