Andhra PradeshHome Page Slider

పార్టీ బలోపేతం కోసం ‘సైలెంట్ ఆపరేషన్’… దూకుడు పెంచిన సీఎం జగన్

రాష్ట్రంలో తమ పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగా ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. సైలంట్ ఆపరేషన్‌ను చేపట్టారు. ఎలక్షన్ 2024 దిశగా అటు రాష్ట్ర పాలనను, పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు సీఎం జగన్. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక్కసారిగా తమ వేగాన్ని పెంచుతున్నాయి.ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు నిరంతరం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉంటున్నాయి.ఈ నేపథ్యంలో అధికార వైసీపీ కూడా వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకు వెళ్తుంది.ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జులు రోజుకు 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సందర్భంలో గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తూ ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

సీఎం జగన్ కూడా ఇదే అంశంపై ప్రతి 45 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తూ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలకు మరింత దీటుగా ఆగస్టు నెల నుంచి మరింత దూకుడుగా సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందజేస్తూ నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించడంలో సీఎం జగన్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దేశంలోనే ముందు వరసలో ఉన్నారు. ఇదే సందర్భంలో నిరుపేదలు కూడా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ఓటర్లు అత్యధిక శాతం మంది జగన్ వైపే మెగ్గు చూపుతూ ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పలు సంస్థలు నిర్వహించిన సర్వేలో కూడా ఇదే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇంకా పార్టీ బలోపేతం కోసం సరికొత్త వ్యూహాల్లో భాగంగా జగన్ ఆగస్టు నెలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుపోతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే ఉద్యోగాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వైసీపీ పార్టీపై ఇప్పటికే నిరుద్యోగుల్లో కొంతమేర వ్యతిరేకత ఉండటంతో వారిని చల్లపరచడానికి ఆ దిశగా ఆయన ఫోకస్ కూడా పెంచారు. ఇప్పటికే త్వరలో డీఎస్సీ ని ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ పోస్టులను పెద్ద ఎత్తున భర్తీ చేయడంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉద్యోగుల జోనల్ విధానం తదితర అంశాలపై కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేస్తున్నారు. వీటితోపాటు భారీ గా పరిశ్రమలను నెలకొల్పి రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గతంలోనే నిర్ణయం తీసుకొని ఆ దిశగా కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కొన్ని పరిశ్రమలు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలలో నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించే దిశగా జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో ప్రజలకు అవసరమైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులను విడుదల చేయబోతున్నారు. దీంతోపాటు రానున్న ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దించే విధంగా ఉమ్మడి 13 జిల్లాల నుండి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని గట్టి అభ్యర్థుల కోసం మమ్మర కసరత్తులు చేస్తూ పార్టీని మరింత బలపేతం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తం మీద సీఎం జగన్ అనేక వ్యూహాలతో సైలెంట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆగస్టు నుంచి ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు పార్టీపరమైన కార్యకలాపాలను కూడా మరింత వేగవంతం చేయటంతో పాటు అందుకోసం ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు.