NationalNews Alert

ఢిల్లీలో సైలెంట్ దీపావళి

ఢిల్లీలో నిశ్శబ్ద దీపావళిని జరుపుకోమని ఆదేశించింది సర్కార్. దీపావళి సమయంలో వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయిలో ఉంటోందని, టపాసులు పేలితే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించింది. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా చాలాసందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా కాలుష్య నివారణకు ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కఠినఆంక్షలు విధిస్తోంది.

టపాసులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఈ నిషేధం జనవరి 1 వరకూ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసారి టపాసుల ఆన్ లైన్ విక్రయాలపై కూడా ఈ నిషేధం ఉంటుందని, అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నామని ఆయన తెలియజేశారు. పర్యావరణ ప్రేమికులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.