అద్భుతాన్ని చూపించిన శుభాంశు శుక్లా.
ప్రపంచ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేస్తున్న భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా దేశ ప్రజలకు అద్భుతాన్ని చూపించారు. ఈ దృశ్యాన్ని చూపించే కుపోలా అనే కిటికీని తెరిచి అందమైన భూమిని చూపించారు. ఈ కిటికీ తీస్తే ప్రపంచం మొత్తాన్ని చూడొచ్చు. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఉన్న విండో అది. వ్యోమగాములు అక్కడికి చేరుకొన్నప్పుడు పుడమి, విశ్వం సౌందర్యాన్ని చూసి మైమరిచిపోతారు. కుపోలా.. అంటే ఇటాలియన్ భాషలో డోము అని అర్థం. 1990ల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం మొదలు పెట్టారు. దీనిలో పలు మాడ్యుళ్లు ఉన్నాయి. వీటిల్లోని ట్రాంక్విలిటీ అనే మాడ్యూల్ ను 2010లో డిస్కవరీ స్పేస్ షెటిల్ సాయంతో ఐఎస్ఎస్ కు చేర్చారు. దీంతోపాటు కుపోలా అనే ఏడు అద్దాల కిటీకీలతో ఉన్న గాజు గది వంటి దానిని కూడా పంపించారు. ఇది 2.95 మీటర్ల చుట్టుకొలత.. 1.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. దీని బరువు 1,880 కిలోలు. మధ్యలో ఓ భారీ అద్దపు కిటికీ.. చుట్టూ ఆరు గాజు కిటీకీలతో పుష్పం డిజైన్ ను తలపిస్తుంది. అతిపెద్దదైన విండో వృత్తాకారంలో 80 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కుపోలాను ఐఎస్ఎస్ కు అనుసంధానించి 15 ఏళ్లు పూర్తయింది. కుపోలా రాక ముందు వ్యోమగాములు భూమిని చూడాలంటే కేవలం ఒక కిటికీ మాత్రమే ఉండేది. తొలుత నాసా-బోయింగ్ కలిసి కుపోలాను నిర్మించాలని అనుకొన్నాయి. కానీ, వ్యయనియంత్రణలో భాగంగా దీనిపై వేటు వేశాయి. నాసాతో ఉన్న బార్టర్ ఒప్పందం ప్రకారం ఐరోపా స్పేస్ ఏజెన్సీ 1998లో ఈ ప్రాజెక్టును స్వీకరించింది. ఎలినియా స్పాజియో అనే సంస్థ దీని డిజైన్, డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్ ను చూసుకొంది. అంతరిక్ష శకలాలు, ఉల్కలు తగిలి ఈ అద్దాలకు గీతలకు పడకుండా ప్రత్యేకమైన షట్టర్లు ఉంటాయి. వీటిని తెరిచేందుకు ప్రత్యేకమైన నాబ్ ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే కుపోలా షట్టర్లు తెరుస్తారు. ఇక్కడి నుంచి స్పేస్ స్టేషన్ బయట భాగం ఎలా ఉందో నేరుగా కంటితో చూడటం సాధ్యమవుతుంది. దీంతోపాటు దాని రోబోటిక్ చేతుల కదలికలను గమనించవచ్చు. ఇక ఆఫ్ డ్యూటీలో ఉన్న ఆస్ట్రోనాట్లు ఇక్కడికి వచ్చి పుడమి సౌందర్యాన్ని, అంతరిక్ష అందాలను వీక్షిస్తూ సేదదీరుతుంటారు. “అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములను పుడమితల్లితో అనుసంధానించే బొడ్డు తాడులాంటిది కుపోలా” అని దీని నిర్మించిన ఎలినియా స్పాజియో అనే ఐరోపా కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ డోరియాన బఫ్ పేర్కొన్నారు. శనివారం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇక్కడ పలు ప్రయోగాలు నిర్వహించారు. ఈసందర్భంగా తీసిన చిత్రాలు వైరల్ గా మారాయి.