Home Page SliderTelangana

ప్రజలు బాగుండాలా? కేసీఆర్ కుమార్తె బాగుండాలా?

కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని, కానీ ప్రజలు బాగుపడాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయమని ప్రధాని నరేంద్రమోదీ భోపాల్ సభలో  సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మేరా బూత్..సబ్‌సే మజ్ బూత్ అనే కార్యక్రమంలో పాల్గొని దేశం నలుమూలల నుండి వచ్చిన బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కుటుంబ పార్టీలపై మాట్లాడారు. దీనిలో కేసీఆర్ కుటుంబం గురించి ఈ రకంగా వ్యాఖ్యానించారు. అంతేకాక విపక్షాల భేటీపై కూడా మండిపడ్డారు. విపక్షాలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీలనిస్తాయని, తాను మాత్రం అవినీతి పరులను వదిలిపెట్టేదే లేదన్నారు. కార్యకర్తలే బీజేపీకి బలమన్నారు. తాను ఏసీ రూముల్లో కూర్చుని మీటింగులు పెట్టనని, ప్రజలతో కలిసి కఠిన వాతావరణాన్ని ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పారు. బీజేపీకి దేశప్రయోజనాలే కీలకమన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలు తనకు తెలియదన్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకే అన్యాయం జరుగుతోందని, అయినా కొందరు  సమర్థిస్తున్నారని ఇది ఓటు బ్యాంకు రాజకీయమేనన్నారు. ప్రతిపక్షపార్టీలు ఈ వ్యవహారంపై ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని , ఉమ్మడి పౌరస్మృతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.