విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు..
స్వీడన్ నుంచి ఫ్లోరిడాకు వెళుతున్న విమాన ప్రయాణికులకు భయానక అనుభవం ఎదురైంది. సాఫీగా వెళుతున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. కొందరైతే ఏకంగా పైకప్పుకు గుద్దుకున్నారు. చేతుల్లో ఉన్న వస్తువులు, పైన పెట్టిన బ్యాగులు, ఎయిర్ హోస్టెస్ లు తీసుకొస్తున్న ఆహార పదార్థాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఉన్నట్టుండి విమానం కుదుపులకు లోనవడంతో ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి, తాము చనిపోబోతున్నామని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్కాండినేవియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం స్వీడన్ లోని స్టాక్ హోం నుంచి ఫ్లోరిడాలోని మయామీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు ఈ విమానం మయామీ లో దిగాల్సి ఉండగా.. మార్గమధ్యంలో ఎయిర్ టర్బులెన్స్ కారణంగా భారీ కుదుపులకు లోనైంది. ప్రయాణికులు సీట్లలో ఎగిరిపడడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్ లో దింపేశాడు. తర్వాత మరో విమానంలో మయామికి పంపించారు.