రాత్రంతా కటిక చీకటిలో చిన్నారులు
ఈ లోకంలో ప్రతి బిడ్డకి అందరికన్నా ముందు గొప్ప మార్గదర్శకుడు నాన్నే. చిన్నప్పటి నుంచి బిడ్డను చేయిపట్టి నడిపిస్తాడు. అదే విధంగా వారిని ఒక ఉన్నత స్థానంలో నిలపాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. బిడ్డల బంగారు భవితకు అహర్నిశలు శ్రమిస్తూ..వారి ఆశయాలు ఫలించే దిశగా కృషి చేస్తాడు. అటువంటి నాన్న తన బిడ్డల పట్ల క్రూరంగా ప్రవర్తించిన ఘటన కర్నూల్‌లో జరిగింది. తాగిన మైకంలో తన ఇద్దరు బిడ్డలను ఎవరు లేని చిమ్మచీకట్లో వదిలేశాడు ఆ కసాయి తండ్రి. మద్యం మత్తులో తమ తండ్రి చేసిన నిర్వాకానికి ఇద్దరు చిన్న బిడ్డలు రాత్రంతా నరకం అనుభవించారు. అభం శుభం తెలియని వయస్సులో రాత్రంతా ఆ చీకటిలో చలికి వణుకుతూ అల్లాడిపోయారు. పోలీసులు,స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వారి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూల్ జిల్లా కోడుమూరుకి చెందిన కృష్ణ,సుజాత దంపతులకు 5గురు సంతానం. వీరిలో ఒక కుమార్తె ,నలుగురు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసైన కృష్ణ,అనుమానంతో భార్యను నిత్యం వేధించేవాడు. గత రెండు రోజుల క్రితం కూడా తన భార్యతో గొడవపడిన కృష్ణ ఆమెను తీవ్రంగా కొట్టాడు. అయితే అప్పటికే మద్యం సేవించిన కృష్ణ ఆ మత్తులో జోగుతూ భార్య,తన ఇద్దరు కుమారులను ఆటోలో ఎక్కించుకొని ఊరికి దూరంగా తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో భార్యను దించేసి ఆమెపై మరోసారి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడిక్కడే స్పృహ కోల్పోయింది.

అనంతరం ఆటోలో ఉన్న ఇద్దరు కుమారులను 5 కిలోమీటర్ల దూరంలోని ప్యాలకుర్తిలోని దిగువ కాల్వగట్టు వద్ద వదిలేశాడు. ఆ ప్రాంతం అంతా చిమ్మచీకటిగా ఉండడంతో పిల్లలిద్దరూ రాత్రంతా భయంతో వణికిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెల్లవారు తుండగా పొలాలకు నీరు పెట్టేందుకు రైతు లక్ష్మీనారాయణ అటుగా వచ్చాడు. ఆ సమయంలో పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు. దాంతో వారి ఆర్తనాదాలను విన్న రైతు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హైవే పోలీసులు వచ్చి చిన్నారులను చేరదీశారు. ఆ పిల్లలిద్దరూ..తమ తల్లి గురించి పోలీసులకు చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి తల్లిని రక్షించారు. మరుసటి రోజు కృష్ణను స్టేషన్‌కు పిలిపించారు. భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి చిన్నారులను వారి చేతికి అప్పగించారు.ఆ వార్త విన్న బాలల సంరక్షణ నిర్వాహకులు కూడా పోలీసు స్టేషన్‌కు చేరుకుని ,చిన్నారులను చేరదీసేందుకు ముందుకొచ్చారు. కాగా నిందితుడు కృష్ణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.