ఏపీలో నిరుద్యోగులకు షాక్
ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ వాయిదా పడింది. దీనిపై నిరుద్యోగుల ఆశలపై నీరు చల్లినట్టయ్యింది. రెండ్రోజుల క్రితమే టెట్ ఫలితాలు విడుదల కావడంతో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఆశిస్తున్న తరుణంలో డీఎస్సీ వాయిదా ఆశనిపాతం అయ్యింది. మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో కూడా తెలియదు. దీనికి ముఖ్య కారణం ఎస్సీ రిజర్వేషన్లే అని తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ పూర్తయ్యేవరకూ డీఎస్సీ ప్రకటన ఇవ్వరాదని ఎంఆర్‌పీఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. దీనితో డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం అవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజునే 16,317 పోస్టులను భర్తీ చేసేలా మెగా డీఎస్సీపై చంద్రబాబు సంతకం చేశారు. దీనితో నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా ఈ పోస్టులు ఇప్పట్లో భర్తీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

