సిరియా నియంత అసద్‌కు షాక్..
సిరియా మాజి అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో సహా పారిపోయి రష్యాను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పరమ క్రూరుడిగా, నియంతగా పేరుతెచ్చుకుని, తిరుగుబాటు దారుల కారణంగా దేశం వదిలి వెళ్లిన అసద్‌కు కుటుంబ జీవితంలో కూడా పెద్ద షాక్ తగిలిందని సమాచారం. అతని భార్య అస్మా, అతడికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆమెకు రష్యాలో ఆశ్రయం పొందడం ఇష్టం లేదు. తన దేశం లండన్ వెళ్లిపోవాలని, అందుకోసం విడాకులు మంజూరు చేయాలంటూ రష్యా కోర్టులో పిటిషన్ వేశారు. ఆమె బ్రిటిష్- సిరియా సంతతికి చెందిన వ్యక్తి. 2000 సంవత్సరంలో అసద్‌ను వివాహం చేసుకుని సిరియాలో అడుగుపెట్టింది. వీరికి ముగ్గురు సంతానం. సిరియాలో బషర్ కుటుంబ పాలన 1971 నుండి కొనసాగుతోంది. గత 20 ఏళ్లుగా వీరి నియంతృత్వ పాలనపై తిరుగుబాటు కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించిన తిరుగుబాటు దారులు విజయం సాధించడంతో వీరి కుటుంబం రష్యాకు పారిపోయింది. ఈ అంతర్యుద్ధంలో 20 ఏళ్లుగా 5 లక్షల మంది మరణించారని సమాచారం.