రజినీకి షాక్
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినీకి మరో షాక్ తగిలింది. గతంలో ఆమె అక్రమాలను ప్రశ్నించిందుకు తన ఇంటిపై దాడి చేశారని, తన కుటుం బాన్ని మానసికంగా హింసించారని చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి డబ్బు గుంజారనే ఆరోపణలతో రజినీ, మరో నలుగురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో రజినీ ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ పై విచారణను ఏప్రిల్ 2కి వాయిదా వేసింది. తాజాగా రజినీపై మరో ఫిర్యాదు అందడం కలకలం రేకెత్తిస్తోంది. 2022 ఏప్రిల్ లో రజినీ మనుషులు తన ఇంటిపైకి వచ్చి దాడి చేశారని, ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేశారని సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే తాను ఫిర్యాదు చేయగా నామమాత్రంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. రజినీ, ఆమె మరిది గోపిపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. రజినీపై వరుస కేసులు నమోదవుతుండడం చర్చనీయాంశమైంది.