Home Page SliderInternational

ఆ దేశంలో’ఆమె’దే అధికారం

మన దేశంలో భర్త చేతుల మీదుగానే కుటుంబం నడుస్తుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ భర్తనే చూసుకోవాలి. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసినప్పటికీ .. చాలా కుటుంబాల్లో భర్తే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది ఈ ట్రెండ్ మారుతోంది. ఇప్పుడు ఆర్థిక నిర్వహణలో భార్యాభర్తలు సమానంగా పాలు పంచుకుంటున్నారు. అయితే.. జపాన్లో లో మాత్రం ఈ పద్ధతి కాస్త విభిన్నంగా ఉంది. అక్కడ సంపాదించేది ఎవరైనా సరే.. నెల జీతం మొత్తం భార్య చేతిలోనే ఉండాలట. ఆ డబ్బు ఎలా ఖర్చు చేయాలనే అధికారం కూడా ఆమెదేనట. జపాన్ దేశంలో ఈ పద్ధతిని ‘కొజుకై’ అని పిలుస్తారు. అక్కడ దాదాపు 75% దంపతులు ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారని ఓ సర్వేలో తెలిసింది. ఇంటి ఖర్చుల గురించి ఇల్లాలి కన్నా బాగా ఎవరికీ తెలీదు అని మనం అంటుంటాం. కానీ జపాన్ లో ఈ విధానాన్ని పాటించి చూపిస్తున్నారు. అందుకే మనీ సేవ్ చేసే విషయంలోనూ జపాన్ దేశస్థులు ముందువరుసలో ఉంటున్నారు.

అటు ఇంటి ఖర్చులతోపాటు పొదుపు, మదుపులోనూ జపాన్ మహిళలు నిష్ణాతులేనట! భర్త సంపాదనను ఇంటి అవసరాల కోసం సరిగ్గా ఖర్చు చేయడమే కాకుండా మిగిలిన డబ్బును పొదుపు చేయడంలోనూ ముందుంటారు జపాన్ మహిళలు. కేవలం పొదుపు చేయడమే కాకుండా లాభాలొచ్చే సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ.. మరి కొంత నగదును ప్రత్యేకమైన ‘మనీ పర్సు’ లో దాచుకుంటారట! ఈ డబ్బు అత్యవసర పరిస్థితుల్లో తమను ఆదుకుంటుందని అక్కడి వారి నమ్మకం. అంతేకాదు ఒక వేళ ఎప్పుడైనా తమ భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చినా.. లేదంటే తమ భర్త నుంచి విడిపోవాల్సి వచ్చినా.. ఇలాంటి విపత్కర పరిస్థితులు సద్దుమణిగే దాకా ఈ డబ్బు వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని జపాన్ మహిళలు అంటున్నారు.