Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderInternational

దేశ ఆర్థిక పరిస్థితిపై షరీఫ్ ఆవేదన

దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అసహనం వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లో శనివారం జరిగిన ఎగుమతిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడాల్సిన దుస్థితిని ప్రస్తావిస్తూ, ‘‘మిత్రదేశాల వద్ద చేతులు చాచి ఆర్థిక సహాయం కోరాల్సి రావడంతో , సిగ్గుపడాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. పరిణామాలు దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని, తలదించుకునే పరిస్థితులకు దారి తీస్తున్నాయని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఐఎంఎఫ్ నుంచి సహకారం, రుణాల పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి మిత్రదేశాలు క్లిష్ట సమయంలో ఆర్థికంగా తోడ్పడుతున్నాయని షెహబాజ్ ప్రశంసించారు. ముఖ్యంగా చైనా బిలియన్ల డాలర్ల సేఫ్ డిపాజిట్లను పునరుద్ధరించడమే కాకుండా, చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకంగా మారిందని ఆయన గుర్తుచేశారు.

సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సహాయం కోసం తిరగాల్సి వస్తోందని, అలా వెళ్లిన ప్రతిసారీ తీవ్ర అపమాన భావన కలుగుతోందని షరిఫ్ వ్యాఖ్యానించారు. రుణభారం పాకిస్తాన్ గౌరవాన్ని దిగజారుస్తోందని, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలు అత్యవసరమని స్పష్టం చేశారు.

రుణాల కోసం యాచించాల్సిన పరిస్థితి దేశానికి అవమానకరమని షరీఫ్ పేర్కొన్నారు. రుణాలకు ప్రతిఫలంగా ఆయా దేశాలు విధించే షరతులకు ‘‘కాదు’’ అని చెప్పలేని బలహీనత తమను వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతటి సంక్షోభంలో ఉందో స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.