Home Page SliderNational

ఎన్‌సీపీ అధినేత పదవికి శరద్‌ పవార్‌ రాజీనామా

మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు. దేశంలోని కీలక ప్రతిపక్ష నాయకులలో పవార్ ఒకరు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపి మధ్య కూటమిని కుదుర్చడంలో పవార్‌ది పెద్ద పాత్ర. ఆయన తర్వాత పార్టీ అధినేత ఎవరనే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నారన్న ప్రాచరం నేపథ్యంలో పవార్ పెద్ద ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.

రాబోయే 15 రోజుల్లో రెండు పెను విస్ఫోటాలు చూడాల్సి వస్తోందని శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఇటీవలే వ్యాఖ్యానించారు. “15 రోజుల్లో పెద్ద రాజకీయ విస్ఫోటనాలు”పై ప్రకాష్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ, “ఢిల్లీలో ఒకటి, మహారాష్ట్రలో మరోటి” అని ఎన్‌సిపి సీనియర్ ఎంపి సుప్రియా సూలే విలేకరులతో అన్నారు. మహారాష్ట్రలో సంఖ్యను పెంచుకోవడానికి పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ, అజిత్ పవార్‌ను దువ్వుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు “అజిత్ దాదా”కి మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వీటన్నింటికీ చెక్ పెట్టేలా శరద్ పవర్ మంత్రాంగం నడిపించినట్టు సమాచారం.