Home Page SliderNational

వరుస ఆత్మహత్యలతో అట్టుడుకిన “షార్”

‘షార్‌’లో భద్రతాదళాల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ కేంద్రాన్ని కాపు కాస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలకు (CIPF) చెందిన కానిస్టేబుల్, ఎస్సైలు 24 గంటల తేడాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు, ఎస్సై భార్య కూడా అతను చనిపోవడాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడడం అందరికీ గుండె బరువెక్కిస్తోంది.

ఈ ప్రదేశంలో గతంలో కూడా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. CIPF కు చెందిన ఈ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడడంపై పూర్తి వివరాలు లేవు. ఇక్కడ దాదాపు ఈ భద్రతా దళాలు 947 మంది పలు స్థాయిలలో ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు కూడా 90 మంది ఉన్నారు.

భారతదేశ అంతరిక్షపరిశోధనా సంస్థ ఇస్రో(ISRO) రాకెట్ విజ్ఞానంలో భారత ఖ్యాతిని ప్రపంచదేశాలలో సగర్వంగా నిలబెట్టింది. ఆంధ్రరాష్ట్రంలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్ ) నుండి రాకెట్లు భూకక్ష్యలోకి ప్రవేశపెట్టబడతాయని మనందరికీ తెలుసు.

షార్‌లో సాధారణంగా ఈ భద్రతా సిబ్బందికి పని ఒత్తిడి అంతగా ఉండదు. ప్రయోగాలు జరిపేటప్పుడు, వీఐపీలు వచ్చినప్పుడే హడావుడి ఉంటుంది. వీరికి తరచూ బదిలీలు జరుగుతుంటాయి. గత సంవత్సరం అక్టోబరులో 500 మంది బదిలీలపై వెళ్లి, కొత్తవారు వచ్చారు.

వీరిలో కానిస్టేబుల్ చింతామణి మరణానికి ఇష్టంలేని వివాహం నిశ్చయించడమే కారణమని తెలుస్తోంది. ఇక ఎస్సై వికాస్ సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురూ ఆరేళ్లలోపు వయసు వారే. ఒక కుమార్తె వికలాంగురాలు. ఈయన 2015 బ్యాచ్‌కు చెందిన వాడని, బాబా ఆటామిక్ రీసెర్చ్ లో పనిచేసి, బదిలీపై ఇక్కడకు వచ్చారని తెలుస్తోంది. అక్కడ పనిచేసేటప్పుడు క్రమశిక్షణ చర్యలకు గురైనట్లు, విచారణ జరుగుతున్నట్లు సమాచారం. పైగా అప్పులు కూడా ఎక్కువగా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ఈ సమాచారం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు శ్రీహరికోట చేరుకున్నారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని వికాస్ సింగ్ భార్య, ప్రియాసింగ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీహరికోటలోని నర్మదా అతిథి భవన్‌లో బస చేసిన ఆమెను స్థానిక పోలీసులు విచారించారు. బుధవారం రాత్రి బందువులతో అక్కడే ఉన్నఆమె, తెల్లవారుజామున గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కుటుంబసభ్యులు గమనించి, వెంటనే సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం వారిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కొరకు, సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు.