కాకినాడలో లైంగిక వేధింపుల కీచక పర్వం
జీజీహెచ్ లో లైంగిక వేధింపులకు నరరూపం 50 మందికి పైగానే ఉన్న పారా మెడికల్ విద్యార్థినులు
- ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ల వికృత దాష్టీకం
- చరవాణిల్లో శరీర భాగాలు పోటోలు తీసి బ్లాక్ మెయిల్
- బాధితుల ఫిర్యాదుతో రహస్య విచారణలో నేరం రుజువు
కాకినాడ : కాకినాడ జీజీహెచ్ లో నెలరోజులుగా నడుస్తోన్న కీచక పర్వం బట్టబయలైంది. విద్యాబుద్ధులు కోసం వచ్చిన పారా మెడికల్ విద్యార్థినులను అదే విభాగంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతడికి మరో ముగ్గురు సిబ్బంది తోడుకావడంతో పరాకాష్టగా వికృత చేష్టలతో పైశాచికత్వం పెచ్చుమిరింది. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థినులపై ఈ మృగాల దాష్టీకానికి తెరలేపారు. బయట పెడితే చంపేస్తామని, పరీక్షల్లో పాస్ కాకుండా చెస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరించడంతో తమపై జరుగుతున్న అకృత్యాన్ని విద్యార్ధినులు భరిస్తూ వచ్చారు. రోజు రోజుకు వికృత రూపం కోరలు చాపుతుండడంతో విద్యార్థినులు ఓపిక నశించి బుధవారం రంగరాయ కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అది కాస్తా రాష్ట్ర డీఎంఈకి చేరుకుంది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్స్సీ-ఎంఎల్టీ విద్యనభ్య సిస్తున్న వారితో పాటు వివిధ ఒకేషనల్ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు కాకినాడ జీజీహెచ్ లోని ల్యాబ్ లలో శిక్షణ పొందుతారు. నెల రోజులుగా వీరు ఆసుపత్రిలో ఏడవ నంబర్, అంబానీ ల్యాబ్ లలో శిక్షణ తీసుకుంటున్నారు. దాదాపు నెల రోజులుగా 70 మంది విద్యార్థినులు ఈ శిక్షణకు హాజరు అవుతున్నారు. అదే ల్యాబ్లో బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ గా పని చేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఆర్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు సహకారం తోడయ్యింది. ఈ ఘటనకు సంబంధించి విషయాన్నంత విద్యార్థినులు ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ కు మెయిల్ చేశారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదును పంపారు. ఒక హెచ్ వోడీ , ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లతో కమిటీ ఈ నెల 9, 10 వ తేదీలలో 48 మంది వరకు విద్యార్థులను విచారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ చక్రవర్తితో పాటు అతడికి సహకరించిన మైక్రో బయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ గోపాల కృష్ణ, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్ లను కూడా లోతుగా విచారణ నిర్హహించారు. విద్యార్థినులు ఆరోగ్య పరీక్షల్లో నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండా వారి శరీర భాగాలు ఫొటోలు తీసి వారికే వాట్సాప్ ద్వారా పంపేవారు. సంబంధిత బాధిత విద్యార్ధిని తోటి విద్యార్ధినితో పంచుకునే విషయం కాకపోవడంతో ఎవరికివారు నిశ్చబ్ధంగా ఉండేవారు. పైపెచ్చు మరోకరికి షేర్ చేసి తమ బాధ బయటికి చెప్పుకునే అవకాశం లేకుండా వన్ టైం వ్యూ ద్వారా పంపేవాడని ఫిర్యా దులో ఘాటుగా తెలిపారు. తాను చెప్పినట్లు వినకపోతే, పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని బెదిరించాడని కళ్యాణ్ చక్రవర్తిపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారమంతా కల్యాణచక్రవర్తితో పాటు జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ సహకరించారని ఫిర్యాదులో వివరించారు. దీనికి బాధ్యులైన వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డీఎంఈ ఆదేశించినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ గారు కళ్లు పికేస్తారా…
కాకినాడ జిజిహెచ్ కు రాజకీయ రంగు పులుముకుంటోంది. కాకినాడ ఎంపీ, రూరల్ ఎమ్మెల్యే, సీటీ ఎమ్మెల్యే, పార్లమెంట్ పరిధిలో పరిధిలో పిఠాపురం అసెంబ్లీ ఉండండం,రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలాకా కావడంతో పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఆడబిడ్డలను ఎవరైనా ఆ దృష్టితో చూస్తే కళ్లు పీకేస్తామన్న పికే ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆడబిడ్డలకు ఏపీలో రక్షణ లేకుండా పోతోందని, నేరాలు ఘోరంగా పెరిగిపోతున్నాయని విపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచే విమర్శలు ఎదురుకోవాల్సి వస్తోంది. ఎన్నికలలో సినిమా డైలాగులు కొట్టి…ఇప్పుడు పత్తా లేకుండా పవన్ కల్యాణ్ కన్పించడం లేదంటూ మరో వైపు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం చంద్రబాబు సీరియస్…
కాకినాడ మెడికల్ కాలేజీ ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. జిజిహెచ్ లైంగిక వేధింపుల ఘటనపై నివేదిక ఇవ్వాలని కోరడంతో ఆరోగ్యశాఖ అధికారులు విచారించిన నివేదికను అందజేసారు. ఈ కీచక వ్యవహారంలో కీలక పాత్రదారులైన కల్యాణ్ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు కలిసి విద్యార్థినులను వేధించారని సీఎం చంద్రాబాబుకు అధికారులు స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.