‘రాక్షసుడిని చంపేశా..తీసుకెళ్లండి’..డీజీపీ హత్య కేసులో సంచలన విషయాలు
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ హత్యను తామే చేసినట్లు భార్య పల్లవి అంగీకరించింది. ఆమెకు కుమార్తె కృతి కూడా సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ హత్య ఆస్థుల వివాదాల వల్ల జరిగిందనే అనుమానాలున్నా, ఆయన భార్య పల్లవి మానసిక స్థితి కూడా కారణమని తెలుస్తోంది. ఆమెకు మానసిక స్థితి బాగోలేదని, ఆమె కోసం రూ. లక్షలు ఖర్చు పెడుతున్నట్లు తోటి పోలీసులకు ఆయన చెప్పేవారని సమాచారం. కరుడు గట్టిన నేరస్థుల తీరులో ఆయనను దారుణంగా పొడిచి చంపారు. చంపే ముందు కళ్లలో కారం చల్లి, చేతులు కాళ్లు కట్టేసి, బీరు బాటిల్‌తో తలపై కొట్టినట్లు తెలుస్తోంది. అనంతరం కత్తితో పొడిచి చంపారు. ఆయన చనిపోయినట్లు ధృవీకరించుకుని పల్లవి అందరికీ ఫోన్లు చేసి చెప్పారని వీఐపీ సెక్యూరిటీ విభాగం పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా పోలీస్ గ్రూపులలో మెసేజీలు పెట్టేవారని, డీజీపీ తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, అతని వద్ద తుపాకులు, మత్తు పదార్థాలు ఉన్నాయంటూ గ్రూపులో పోస్టులు చేసేదని తెలిసింది. హత్య చేసిన అనంతరం ‘రాక్షసుడిని చంపేశా, తీసుకెళ్లండని’ గ్రూప్‌లో మెసేజ్ పెట్టారని, ఆమె మానసిక స్థితి చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు. డీజీపీకి ఉత్తర కన్నడ జిల్లా దండేలి వద్ద ఉన్న 17 ఎకరాల భూమిని కుమారునికి, తన చెల్లెలికి రాసేందుకు ఆయన సిద్దమయ్యారని, ఈ విషయంలో తరచూ భార్య, కుమార్తె గొడవ పడుతూండేవారని సమాచారం.