ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు..
అస్సాం రాష్ట్రప్రతిపక్ష ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను పోలీసులు గురువారం (ఏప్రిల్ 24) అరెస్ట్ చేశారు. పహల్గాం ఉగ్ర ఘటనపై పాకిస్థాన్‌కు మద్దతు పలికారన్న కారణంపై ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి కటకటాల వెనుక వేశారు. ఆయనను నాగావ్ జిల్లాలోని తన నివాసంలో అరెస్టు చేశారు. పార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్.. ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ వ్యాఖ్యలను ఖండించారు. ఆ అభిప్రాయాలు ఆయన సొంత అభిప్రాయాలే తప్ప పార్టీవి కావని స్పష్టం చేశారు. అమీనుల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. ఇది మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన సమయం. ఉగ్రవాదులకు మతం లేదు. ఈ ఉగ్రవాదులు ఇస్లాంను కించపరుస్తున్నారని అజ్మల్ అన్నారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై ఎమ్మెల్యే ఇస్లాం తప్పుడు ప్రకటన చేస్తూ, రెచ్చగొట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనితో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.