Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNews

అమిత్ షా డెడ్‌లైన్‌కు ముందే లక్ష్యం సాధించిన భద్రతా బలగాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మావోయిజాన్ని మూలంతో సహా నిర్మూలించేందుకు కేంద్రం తీసుకున్న దృఢ నిర్ణయాల్లో ఇది కీలక ఘట్టంగా భావిస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్‌కు ముందే జరిగిందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మావోయిజాన్ని 2026 మార్చి 31నాటికి పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన గడువు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని అత్యంత ప్రమాదకర మావోయిస్టు నాయకుడిగా పేరొందిన హిడ్మాను నవంబర్ 30లోపు ఏ విధంగానైనా నిష్క్రియం చేయాలని భద్రతా దళాలకు షా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఆదేశాల ప్రకారం గూఢచారి విభాగాలు, CRPF, గ్రేహౌండ్స్ మరియు ఇతర ఏజెన్సీలు సంయుక్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి. చివరకు మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఆపరేషన్‌లో హిడ్మా, అతని భార్యతో పాటు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఆపరేషన్‌ను కేంద్ర, రాష్ట్ర భద్రతా ఏజెన్సీలు మేజర్ సక్సెస్‌గా పరిగణిస్తున్నాయి.

హిడ్మా మరణం మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద ఎదురుదెబ్బగా భావించబడుతోంది. రాబోయే నెలల్లో మిగిలిన కీలక ప్లాటూన్లను నిర్వీర్యం చేయాలని కేంద్రం వేగవంతమైన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.