బ్యాంకులకు సెబీ చైర్మన్ హెచ్చరిక
ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణలు పాటించడం బ్యాంకుల యాజమాన్యాల నైతిక బాధ్యత అని సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే అన్నారు. సున్నిత సమాచారం ఆధారంగా జరగే ట్రేడింగ్‌లను అడ్డుకునేందుకు బ్యాంకులు తమ అంతర్గత నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని సూచించారు.అంతర్గత నియంత్రణలు బలహీనంగా ఉన్నప్పుడు, ప్రక్రియలు స్పష్టంగా లేకపోతే, బాధ్యతలు సరిగా నిర్వచించకపోతే, పర్యవేక్షణలో లోపాలు ఉంటే ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రమాదం పెరిగే అవకాశముందని పాండే అన్నారు. నిజానికి, చాలా మోసాలకు ఇటువంటి బలహీనతలే కారణమని తెలిపారు.ఇటీవల ఇండస్ ఇండ్ బ్యాంక్‌కి చెందిన మాజీ ఎండీ, సీఈవోలు బయటకు వెల్లడించని సున్నిత సమాచారం (UPSI) ఆధారంగా ట్రేడింగ్ చేసినట్లు తేలింది. . ఈ నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి . ప్రతి సంస్థ కూడా సున్నిత సమాచారం విషయంలో పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని పాండే సూచించారు. ఇందుకోసం బలమైన అంతర్గత నియంత్రణల ఏర్పాటు,సమాచారాన్ని తక్షణమే స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించడం,ఉద్యోగుల్లో బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కల్పించడం వంటివి అవసరమని తెలిపారు.సమావేశాల్లో సున్నిత సమాచారాన్ని అనధికారికంగా పంచుకోవడం, ఈమెయిల్ రూపంలో పంపినా అది కూడా ఉల్లంఘనగానే పరిగణించాలన్నారు. “ఒక్కసారి సమాచారం లీక్ అయితే, అది సెకన్లలోనే డిజిటల్ నెట్‌వర్క్ మీద వ్యాపిస్తుంది. దాంతో స్టాక్ ధరలు పడిపోవచ్చు, మదుపర్ల విశ్వాసం దెబ్బతింటుంది, సంస్థ ప్రతిష్టకు నష్టం జరుగుతుంది ఇవన్నీ తిరిగి సాధ్యం కావు,” అని ఆయన హెచ్చరించారు.