బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థుల కోసం అన్వేషణ
యువతకు టికెట్లు ఇచ్చే దిశగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు
బలమైన అభ్యర్థులపై గురి
బీసీలకు మరింత ప్రాధాన్యత
జాబితాలను సిద్ధం చేస్తున్న ఇరు పార్టీల అధినేతలు
ఏపీలో గత ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు గాను వైయస్సార్సీపీ 151 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 23 స్థానాల్లో, జనసేన పార్టీ ఒక స్థానంలో విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలను సొంతం చేసుకోవాలని సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంటే తెలుగుదేశం పార్టీ అధినేత ఎలా అయినా అధికారాన్ని కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే 175 స్థానాల్లో గెలుపొందడం ఆషామాషీ విషయం కాదు. ఇదే విషయం సీఎం జగన్ కూడా తెలుసు. అందుకోసమే ఆయన గడిచిన నాలుగు సంవత్సరాల మూడు నెలలుగా ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.అలానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వివిధ రకాలైన వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకు వెళ్తూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన ఇరు పార్టీల అధినేతలు ఆయా నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇంచార్జ్లను మార్చవలసి ఉంటే అక్కడ యువతకు అవకాశం కల్పించాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ దిశగానే ఆయా జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు స్థానిక నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అక్కడ కొత్త ముఖాలను దగ్గర తీస్తూ వారి బలాబలాలపై రహస్యంగా నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా పలు సర్వేలు పూర్తయినప్పటికీ మార్పులు చేర్పులు చేపట్టే నియోజకవర్గాలలో కూడా కొత్తగా సర్వేలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల బరిలో కొత్త ముఖాలు కనిపించబోతున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో అధికార వైఎస్ఆర్సీపీ విపక్ష తెలుగుదేశం పార్టీలు ఎక్కువ సంఖ్యలో యువతను బరిలోకి దించేయోచనలో ఉన్నాయి. ఆదిశగానే శరవేగంగా కసరత్తులు చేస్తున్నాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యతను ఇరు పార్టీలు ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో రెండు పార్టీలు బీసీల ఓట్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగానే ఆ సామాజిక వర్గానికి చెందిన యువతకు వీలైనంతవరకు ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రెండు పార్టీల్లోనూ అదే తరహా కసరత్తు మొదలైంది.

సీఎం జగన్ వెనుకబడిన ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ పెంచుకోవాలని అందుకోసం నిత్యం ప్రజల్లో ఉండాలని సూచిస్తూ వస్తున్నారు. అయినా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గం ఇన్చార్జిలలో మార్పు కనిపించడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాలలో కొత్త వారికి అవకాశం కల్పించాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే తరహా కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలు జిల్లాలో చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించగా మరికొన్ని జిల్లాల్లో కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తం మీద వైయస్సార్సీపీ ,తెలుగుదేశం పార్టీల నుంచి వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున కొత్త ముఖాలు కనిపించబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

