‘సీఎం చంద్రబాబుకి ఇదే చెప్పా’-పవన్ కళ్యాణ్
‘తప్పు చేస్తే ఎవ్వరూ తప్పించుకోలేరని’ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ భవిష్యత్తు కోసం తాను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం సీఎం చంద్రబాబుకు కూడా చెప్పానన్నారు. గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే తీర్మానంలో ఆయన సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి జనసేన పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటే టీడీపీకి కూడా దూరమవుతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ఖజానా ఖాళీ అయ్యిందని, అమరావతి, పోలవరం అభివృద్ధి ఆగిపోయిందని, సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని విమర్శించారు. వైసీపీ నాయకులు ఓడిపోయినా మనపై దాడులు చేస్తున్నారు.. మనం అలా చేయొద్దు. ఈ ప్రభుత్వంలో అందరూ అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలని, కక్ష సాధింపులకు పాల్పడవద్దని హెచ్చరించారు. జగన్ ఎంత ఇబ్బంది పెట్టినా రఘు రామకృష్ణరాజు ఆయనపై కక్ష సాధింపుకు పాల్పడలేదని, భుజం తట్టి మాట్లాడారని గుర్తు చేశారు. పెద్ద మనసుతో హుందాగా ప్రవర్తించారని ప్రశంసించారు. మనందరం ఆయనను చూసి ఎంతో నేర్చుకోవాలని హితవు చెప్పారు.