Home Page SliderNational

అనాథలపై పైశాచికత్వం..చిన్నారులను నేలకేసి కొట్టిన వైనం

 అమ్మనాన్న లేని అనాథలకు అనాథ శరణాలయాలే దిక్కు. మరి ఆ అనాథ శరణాలయాల నిర్వాహకులే వారికి నరకం చూపిస్తుంటే వారు ఎక్కడికి వెళ్తారు. ఎక్కడికి వెళ్లలేక కొందరు మానవత్వం లేని మనుష్యుల మధ్య చిత్రహింసలకు గురవుతున్నారు. కాగా ఛత్తీస్‌ఘడ్‌లోని ఓ అనాథ శరణాలయం నిర్వాహకురాలు చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది. చిన్నపిల్లలు అని కూడా లేకుండా వారిని దారుణంగా కొట్టింది. ఓ బాలిక జుట్టు పట్టుకుని నేలపై విసిరి కొట్టింది. మళ్లీ లేపి మంచంపైకి విసిరేసింది. కొట్టొద్దని కన్నీళ్లతో ఎంత ప్రాధేయపడ్డా ఆమె వినిపించుకోలేదు.  అంతేకాకుండా ఆమె మరో చిన్నారిపై కూడా పాశవికంగా దాడి చేసింది. ఈ దారుణాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన పోలీసులు నిందితురాలు సీమా ద్వివేదిని అరెస్టు చేశారు.