NationalNews

జయలలిత మృతికి పరోక్ష కారణం శశికళ

చెన్నై, మనసర్కార్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2016లో మరణించారు. ఆమె 2016 సంవత్సరంలో అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆమె చాలా కాలంపాటు చికిత్స పొందారు. అనంతరం ఆమె ఆరోగ్యం విషమించడంతో అదే ఏడాది డిశంబర్‌లో తుది శ్వాస విడిచారు. అయితే ఆమె మరణం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆమె మరణంపై అనుమానాలున్నట్లు పలువురు ఆరోపించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం జయ మరణానికి గల వాస్తవాలను వెలికితీసేందుకు ఆర్ముగన్‌స్వామి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అప్పటి నుంచి జయలలిత మరణానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఎందరినో విచారించింది.

ఎట్టకేలకు ఇప్పడు వాస్తవాల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీలో ఈ కమిటీ నివేదిక విడుదల చేసింది. అయితే ఈ ఆర్ముగస్వామి కమిషన్ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జయలలిత మృతికి పరోక్షంగా శశికళ కారణమని ఈ కమిటీ వెల్లడించింది. దీనికి ప్రధానకారణం జయలలిత మృతి సమయంలో ఆమెకు శశికళతో విభేదాలున్నాయని కమిటీ తెలిపింది.  అంతేకాకుండా జయలలిత హస్పటల్‌లో చేరిన తర్వాత జరిగిన పరిణామాలను శశికళ గోప్యంగా ఉంచారని కమిటీ స్పష్టం చేసింది. జయలలిత మృతి చెందిన సమయంలో అపోలో వైద్యుల తీరును కమిటీ తప్పుబట్టింది. ఈ మేరకు జయలలిత మృతి కేసులో అనుమానితులను విచారించాల్సిందేనని ఆర్ముగస్వామి కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.