తడి బట్టలతో బండి సంజయ్ ప్రమాణం
టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం యాదాద్రిలోని లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేశారు. మొయినాబాద్ ఫాం హౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తనకు గానీ.. బీజేపీకి గానీ ఎలంటా సంబంధం లేదని అర్చకుల ముందు ప్రమాణం చేశారు. ఉదయం 9 గంటలకు యాదాద్రికి వెళ్తానన్న బండి సంజయ్‌కు పోలీసులు అడ్డంకులు సృష్టించడంతో మధ్యాహ్నం చేరుకున్నారు. అంతకు ముందు టీఆర్‌ఎస్ కార్యకర్తలు యాదాద్రిలో నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ జెండాలను చించేశారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలి..
మరోవైపు బండి సంజయ్ పర్యటనకు బీజేపీ శ్రేణులు సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో బండి సంజయ్‌ను పోలీసులు కొంతసేపు అడ్డుకున్నారు. ఒకానొక దశలో బండి సంజయ్‌ను అరెస్టు చేస్తారనే వార్తలొచ్చాయి. చివరికి మధ్యాహ్నానికి పోలీసులు అనుమతించడంతో యాదాద్రికి చేరుకున్న సంజయ్ ఆలయ స్నానఘట్టంలో స్నానం చేసి తడిబట్టలతోనే లక్ష్మినరసింహ స్వామి వారి పాదాల వద్దకు వెళ్లి ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యవహారంలో తనకు ప్రమేయం లేదంటూ ప్రమాణం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.

