హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3 విజేతగా సనా మక్బుల్
బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. హిందీలో బ్లాక్ బస్టర్ రియాలిటీ షో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3 పూర్తయింది. ఈ సీజన్ విజేతగా నటి సనా మక్బుల్ నిలిచారు. సనా మక్బుల్‌కు, నేజీకు మధ్య చివరివరకు తీవ్ర పోటీ నెలకొనగా.. చివరకు సనానే విజేత అంటూ సీజన్ 3 హోస్ట్ అనిల్‌కపూర్ ప్రకటించారు. సనా టైటిల్‌తో పాటు రూ.25 లక్షల బహుమతిని దక్కించుకుంది.
జూన్ 21న ప్రారంభమైన ఈ సీజన్ ఆగస్టు 2తో కంప్లీట్ అయింది. ఓటీటీలో రన్ అవుతున్న ఈ షోకి గతంలో కరణ్‌జోహర్, సల్మాన్‌ఖాన్ హోస్ట్‌లుగా వ్యవహారించారు. ఇక ఫైనల్ ఎపిసోడ్‌లో స్త్రీ 2 లో కలిసి నటిస్తున్న రాజ్‌కుమార్ రావు, శ్రద్దాకపూర్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. ముంబయిలో పుట్టిన సనా మోడలింగ్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది. పలు సోప్ ఓపెరా (సీరియల్స్)ల్లో నటిస్తూనే అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో సనా నటించిన చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య’. నాగశౌర్య, అజయ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రంలో సనా కథానాయికగా నటించింది.