ఈసారి గజ్వేల్‌లోనూ అదే జరుగుతుంది: ఈటల రాజేందర్
గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్‌లో పార్టీ కార్యకర్తలతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.
గజ్వేల్: గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికుయుక్తులు పన్నినా గజ్వేల్‌లో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. వర్గల్ సరస్వతీ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం పార్టీ కార్యకర్తలతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఈటల మాట్లాడుతూ.. గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సరే మీటింగ్ పెట్టుకోవచ్చు. అయితే, బీజేపీ నిర్వహించే సమావేశాలకు రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారు. దావతులు ఇచ్చి, పైసలు పంచి తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో రాకుండా చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. కానీ అక్కడ ఈ ప్రలోభాలు, డబ్బు పంపకాలకు హుజూరాబాద్ ప్రజలు పాతరేసి ధర్మాన్ని, న్యాయాన్ని, ఉద్యమ బిడ్డను గెలిపించుకున్నారు. ఈసారి గజ్వేల్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంటుంది. ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని కాపాడాలని గజ్వేల్ ప్రజలను వేడుకుంటున్నా అని అన్నారు.

