కామారెడ్డిలో సమన్విత ఆసుపత్రి నిర్వాకం..లైసెన్స్ రద్దు
కామారెడ్డిలోని సమన్విత ఆసుపత్రిలో దారుణం జరిగింది. పసిబిడ్డను విక్రయించారనే ఆరోపణలతో ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయబడింది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనపై డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రజలలో ఈ విషయాలలో చైతన్యం రావాలని మాయమాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. శిశువు లింగనిర్ధారణ చేయడం, శిశువులను విక్రయించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిపై భ్రూణ హత్యలు, లింగ నిర్థారణ, లింగ వివక్ష చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఆసుపత్రిలో అనుమతులు లేకుండా ఫెర్టిలిటీ పేరుతో లింగ నిర్థారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కానింగులు, అబార్షన్ల కోసం ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఈ ఆసుపత్రికి రావడం విశేషం. ఇలాంటి ఆసుపత్రులలో తనిఖీలు చేపట్టకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ పాపంలో భాగమయ్యారు. ఇక్కడ అబార్షన్లకు సంబంధించి చార్జీలు కూడా ఫ్లెక్సీలలో ఉండడం చూసి అధికారులు అవాక్కయ్యారు.