మహారాష్ట్రలో తల్లికి వందనం..
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పౌరులకు సంబంధించిన ప్రతీ పత్రాలలోనూ తల్లి పేరును తప్పనిసరిగా నమోదు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఇది మే 1 ,2024 తర్వాత పుట్టిన పిల్లల నుండి అమలు కానుంది. ఈ విషయంలో అనాథలకు మినహాయింపు ఉంది. సాధారణంగా ఆ రాష్ట్రంలో వ్యక్తి పేరు తర్వాత తండ్రి పేరు ఉంటుంది, చివర సామాజిక వర్గం పేరు ఉంటుంది. శాస్త్రి, శర్మ, క్షత్రియ, రాజ్‌పుత్, ఠాకూర్, సింగ్, అగర్వాల్, గుప్తా వంటి పేర్లు పెట్టుకుంటారు. తాజా చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారిక రికార్డులలో తల్లి పేరును కూడా చేర్చాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని ప్రచారం చేయడం కోసం ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్, మరి కొందరు మంత్రులు కూడా తమ పేర్లలో తల్లి పేరును చేర్చుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి పేరును చేర్చుకుని దేవేంద్ర సరిత గంగాధర్ రావు ఫడ్నవీస్ అని, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా తల్లి దండ్రుల పేర్లు పెట్టుకుని ఏక్‌నాథ్ గంగూబాయి శింభాజీ షిండేగా పేరు మార్చుకున్నారు. దీనికంతటికీ కారణం ఒక లా విద్యార్థిని డిగ్రీ పట్టా తీసుకుని అందులో తల్లి పేరు లేకపోవడంతో, తన తల్లి పేరు చేర్చేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరింది. ఈ కోరికను మన్నించిన హైకోర్టు మహారాష్ట్ర ప్రజలందరికీ ఇది వర్తిస్తుందని ఆదేశించింది. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలిచింది.

