వేలల్లో జీతం..కోట్లల్లో ఆస్తి
ఓ ఉద్యోగి జీతం నెలకి రూ.30,000/- ఈ జీతంతో ఆ ఉద్యోగి ఏడాదికి లక్షల్లో సంపాదిస్తారని వాస్తవంగా అందరూ అనుకుంటారు. కానీ వాస్తవాలను తలకిందులు చేసేలా కేవలం నెలకి రూ.30 వేల జీతంతో ఓ ఉద్యోగి ఏకంగా రూ.7 కోట్ల ఆస్తులను సంపాదించింది. అయితే వినటానికి విడ్డూరంగా ఉన్నా కూడా ఇది నిజం. మధ్యప్రదేశ్ హౌసింగ్ కార్పోరేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హేమ మీనా ఈ విధంగా రూ.30 వేల జీతంతో రూ.7 కోట్ల ఆస్తులను వెనకేసి అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హేమ ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆమెకు మొత్తం రూ.7 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో 20,000చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు,ఇతర ఇళ్ల స్థలాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఇందులో అందరినీ ఆశ్యర్యపరిచే విషయం ఏంటంటే హేమ మీనా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కాగా ఆమె నెల జీతం కేవలం 30 వేల రూపాయలు మాత్రమే.