రేవంత్ మాటలకు సబితా ఆవేదన
సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి శాసన సభలో చేసిన వ్యాఖ్యలకు కన్నీరు పెడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు మజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. “శాసన సభలో కేటీఆర్ గారు బడ్జెట్ పై నిజాలు మాట్లాతుంటే దాన్ని నుంచి డైవర్ట్ చేసేందుకే మాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. మీ వెనుక కూర్చొన్న మహిళలు అంటూ మమ్మల్ని అవమానపరిచారు. నేను మోసం చేశానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను కాంగ్రెస్ లో ఆయనను రమ్మనటమే నేను చేసిన తప్పా? మమ్మల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ దే దిక్కు అంటున్నారు. ఇది మమ్మల్ని మాత్రమే కాదు మొత్తం తెలంగాణ మహిళలను అవమానించినట్లే అక్కలను నమ్ముకుంటే బతుకు ఆగమైపోతదని అన్నట్లుగా సీఎం గారు మాట్లాడారు.
భట్టి గారు కూడా నా కారణంగానే ఎల్ఓపీ పోయిందన్నట్లుగా అన్నారు. మరీ సీఎం గా ఎందుకు మీరు ప్రయత్నించలేదు. ఏ మొఖం పెట్టుకొని వచ్చారని ఆయన అన్నారు. ఇది చాలా బాధనిపించింది. మేము ఏం తప్పు చేయలేదు. చాలా మంది కూడా పార్టీలు మారారు. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకిని మా ఇంటిపై వాలకుండా చేస్తామన్నారు. ఇప్పుడు మీ పక్కన పార్టీ మారిన వాళ్లను ఎందుకు పెట్టుకున్నారు? మేము కాంగ్రెస్ నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందో…ఎలా మెడబట్టి బయటకు గెంటే ప్రయత్నం చేశారో మాకే తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు మా మహిళలను ప్రోత్సహించారు. ఇవ్వాళ ఒకరిద్దరూ మహిళలు వస్తుంటే వారిని కూడా అవమానిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలోనే మహిళలను అవమానించే పరిస్థితి వచ్చిందంటే ప్రజలే ఆలోచించాలి. సీఎం గారి కుర్చీకి గౌరవం పెరగాలంటే మీరు తెలంగాణ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. అంటూ సబిత ఆవేదన వ్యక్తం చేశారు.