సినిమా టాకీస్, ఫంక్షన్ హాళ్లకు రైతు బంధు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన నిధులను స్వాహా చేశారు. దీనికి ఇదే నిదర్శనం.. రైతుబంధు పథకం ఎంతగా దుర్వినియోగం అయిందో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఏకంగా సినిమా టాకీస్, రైస్ మిల్లులు, ఫంక్షన్ హాల్స్, వాణిజ్య సముదాయాలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు ఏళ్లతరబడి రైతు బంధు లబ్ధి పొందుతున్నట్టు తాజాగా ప్రభుత్వం చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాగులో లేని భూములకు రైతు భరోసా నిలిపివేయాలని నిర్ణయించింది. కొన్ని రోజులుగా అధికారులు ఆయా భూములను గుర్తించే పనిలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే విస్తుపోయే అక్రమాలు బయటపడుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని 892, 803 సర్వే నంబర్లలో 1.4 ఎకరాల్లో ఉన్న యశోద నరహరి ఫంక్షన్ హాల్ వాణిజ్య సముదాయం, పరికగిద్య ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని సర్వేనెంబరు 776పరిధిలో 1.28 ఎకరాల స్థలంలో ఉన్న శ్రీరామ సినిమా థియేటర్, 852 నంబర్ 1.10 ఎకరాల స్థలంలో ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, 28 ఇటుక బట్టీలు.. ఇలా మొత్తం 40 ఎకరాలకు రైతుబంధు జమ అవుతున్నట్టు గుర్తించామని తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి తెలిపారు.