ప్రముఖ సినీ నటులకు రైతు బంధు సాయం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే.. రైతు బంధ పథకం నానాటికీ అభాసుపాలవుతోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఈ పథకం కింద పేదలు, చిన్న రైతులకు మాత్రమే సాయం అందితే బాగుండేది. కానీ భూస్వాములు, సేద్యపు భూములున్న పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులకు కూడా లక్షల్లో సాయం అందుతుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు సైతం ఈ స్కీం కింద డబ్బులు జమ అయ్యాయన్న వార్త ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయలు ఉన్న హీరోకు రైతుబంధు రావడం పట్ల తెలంగాణ రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మరో సినీనటుడు అయిన మహేష్‌బాబుకు కూడా రైతు బంధు కింద డబ్బులు జమ అయ్యాయి. అయితే ఆ భూమిని కౌలుకు చేస్తున్న రైతుకు మాత్రం రూపాయి దక్కడం లేదు. కానీ పలువురు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రైతు బంధు డబ్బును పొందుతున్నారు.

వందల ఎకరాలు ఉన్న ధనవంతులకు కూడా రైతు బంధు పథకాన్ని వర్తింప జేయడం ఎందుకు అని ప్రశ్నించారు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి. సినీ హీరో అక్కినేని నాగార్జున కూడా రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, నాగార్జునకు రైతు బంధు డబ్బులు అవసరమా అంటూ ఆకునూరి మురళి ప్రశ్నించారు. అమెరికాలో 30 ఏళ్లుగా పని చేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఆరువందల ఎకరాలను కలిగి ఉంటే, అతని ఖాతాలో కూడా రైతు బంధు డబ్బులు పడుతున్నాయని ఆకునూరి మురళి తెలిపారు.
