Breaking Newshome page sliderHome Page SliderNational

భారత్ కు రష్యా హామీ

భారత ఇంధన అవసరాలకు గణనీయమైన మద్దతు రష్యా నుంచి లభిస్తుందని పుతిన్ హామీ ఇచ్చారు . తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం భారత్–రష్యా సహకారంలో అత్యంత ప్రతిష్టాత్మక ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని పుతిన్ పేర్కొన్నారు. వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం ఢిల్లీలో కీలక సమావేశం జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, ఇంధన భద్రత వంటి అనేక అంశాలపై చర్చించిన తర్వాత ఇద్దరు నేతలు జాయింట్ ప్రెస్ మీట్‌లో పాల్గొని వివరాలను వెల్లడించారు.కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం లో ఇప్పటికే ఆరు రియాక్టర్లలో రెండూ విద్యుత్ నెట్‌వర్క్‌కి అనుసంధానం అవ్వగా, మిగిలిన నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయని పుతిన్ తెలిపారు. మొత్తం 6 వేల మెగావాట్ల సామర్థ్యంతో పనిచేయనున్న ఈ ప్లాంట్‌ పూర్తి స్థాయిలో ప్రారంభం అయితే భారత ఇంధన అవసరాలకు గణనీయమైన మద్దతు లభిస్తుందన్నారు.పుతిన్ ప్రకటన తర్వాత , రష్యా అణుశక్తి సంస్థ రోసాటమ్ కుడంకుళం ప్లాంట్ మూడో రియాక్టర్‌కు అవసరమైన తొలి అణు ఇంధనాన్ని కార్గో విమానంలో భారత్‌కి పంపినట్లు వెల్లడించింది. నోవోసిబిర్స్క్ కెమికల్ కాన్‌సెంట్రేట్స్ ప్లాంట్‌లో తయారైన ఈ ఇంధనం, 2024లో ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, మూడో మరియు నాలుగో రియాక్టర్ల కోసం మొత్తం ఏడు విమానాల్లో దశలవారీగా డెలివరీ చేయబడనుంది. అణు విద్యుత్ రంగానికే కాకుండా, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, తేలియాడే అణు విద్యుత్ కేంద్రాలు, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో అణు టెక్నాలజీ వినియోగాన్ని విస్తరించేందుకు కూడా భారత్‌కు సహకరించేందుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు. ఇంధన భద్రత విషయానికొస్తే, చమురు, గ్యాస్, బొగ్గు వంటి ప్రధాన వనరుల సరఫరాలో రష్యా భారత్‌కు విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతుందని, వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధనం అందించేందుకు తమ దేశం కట్టుబడి ఉందని పుతిన్ హామీ ఇచ్చారు.