మార్చిలో రష్యా ఎన్నికలు
మాస్కో: రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారైంది. 2024 మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై రష్యా ఎగువసభ ఫెడరేషన్ కౌన్సిల్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో, అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యిందని స్పీకర్ వలెంటినా మట్వియెంకో ప్రకటించారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ మరో విడత పోటీ చేస్తానంటూ అధికారికంగా ప్రకటించలేదు. ఎన్నికల తేదీ ఖరారైనందున, ఐదోసారీ ఆయన బరిలో ఉంటారని భావిస్తున్నారు. ఆరేళ్ల ఆయన పదవీకాలం 2024 లో ముగియాల్సి ఉంది. కానీ, పుతిన్ తీసుకువచ్చిన రాజ్యాంగ సంస్కరణల ప్రకారం 2024 తర్వాత మరో రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగే వీలుంది.