రూపాయితో వ్యాపారం లాభసాటిగా లేదంటున్న రష్యా
భారతీయ బ్యాంకుల్లో బిలియన్ల రూపాయలను రష్యా డిపాజిట్ చేసిందని… వాటిని ఉపయోగించుకోలేకపోతున్నామని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా లావ్‌రోవ్ గోవాలో విలేకరులతో మాట్లాడుతూ, ఇది ఒక సమస్య. “మేము ఈ డబ్బును ఉపయోగించాలి. అయితే దీని కోసం, ఈ రూపాయలను మరొక కరెన్సీలో బదిలీ చేసే విషయమై చర్చిస్తున్నామన్నారు.” 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో రష్యాకు భారతదేశం మొత్తం ఎగుమతులు 11.6% తగ్గి $2.8 బిలియన్లకు చేరగా, అదే సమయంలో దిగుమతులు దాదాపు ఐదు రెట్లు పెరిగి $41.56 బిలియన్లకు చేరుకున్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దండయాత్రతో యూరప్ దేశాలు గ్యాస్ కొనుగోళ్లు జరపకపోవడంతో, గత సంవత్సరం రాయితీ రష్యన్ చమురును భారత్ భారీగా కొనుగోలు చేస్తోంది. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ వోర్టెక్సా లిమిటెడ్ ప్రకారం, భారతదేశం ద్వారా రష్యా క్రూడ్ దిగుమతులు ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 1.68 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నాయి. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే ఆరు రెట్లు ఎక్కువ. రష్యన్ బ్యాంకులపై ఆంక్షలు, SWIFT వ్యవస్థను ఉపయోగించి లావాదేవీలపై నిషేధం తర్వాత క్రెమ్లిన్, భారతదేశాన్ని జాతీయ కరెన్సీలలో వ్యాపారం చేయమని ప్రోత్సహించింది. అయితే యుద్ధం ప్రారంభమైన వెంటనే రూబుల్‌లో అస్థిరత కారణంగా చమురు దిగుమతుల కోసం రూపాయి-రూబుల్ డీల్‌ను ఇరుదేశాలు రద్దు చేశాయి. ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి మాస్కోతో సంబంధాలను తగ్గించుకోవాలని అమెరికా, భారత్‌పై ఒత్తిడి చేసింది.

అమెరికా ఆంక్షలను ఉల్లంఘించి, చెల్లింపులు జరపలేకపోవడంతో ఇండియాకు, రక్షణ సరఫరాలు నిలిచిపోయాయి. దశాబ్దాలుగా రష్యా భారతదేశానికి అతిపెద్ద ఆయుధ సరఫరాదారు. రష్యాకు ఇండియా చెల్లించాల్సిన $2 బిలియన్ల కంటే ఎక్కువ ఆయుధాల చెల్లింపులు ఒక సంవత్సరంగా నిలిచిపోయాయి. అయితే రష్యా కొనుగోళ్లకు రూపాయలను అంగీకరించడానికి ఇష్టపడదు. చమురు శుద్ధి సంస్థలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌లు, రూబిళ్లు, రూపాయలను ఉపయోగించి రాయితీపై ముడి చమురు కోసం చెల్లింపులకు ప్రయత్నిస్తున్నాయి. గ్రూప్ ఆఫ్ సెవెన్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ భాగస్వాములు నిర్ణయించిన $60 బ్యారెల్ ధర పరిమితి కంటే తక్కువ ధర ఉంటే అంతర్జాతీయ పరిమితుల నుండి మినహాయింపు పొందవచ్చు.