InternationalNews

డాలర్‌ దెబ్బకు రూపాయి విలవిల

రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం రూ.81.50కు చేరింది. ద్రవ్యోల్బణం భయంతో అన్ని దేశాలు వడ్డీ రేట్లను పెంచడంతో కరెన్సీ విలువ పడిపోతోంది. మాంద్యం ముంగిట నిలిచిన అమెరికా, బ్రిటన్‌ కూడా బ్యాంకు వడ్డీ రేట్లను పెంచాయి. అయితే.. డాలర్‌ మాత్రం బలపడింది. డాలర్‌తో పోలిస్తే ఇతర కరెన్సీలు భారీగా పతనమయ్యాయి. రూపాయి పతనం మరికొంత కాలం కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటన కీలకం కానుంది. ఆర్‌బీఐ దేశంలోని బ్యాంకు రెపో రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకున్న నేపథ్యంలో విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోతున్నాయి.

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు..

భవిష్యత్తులోనూ వడ్డీ రేట్లు పెంచుతామని అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చెప్పడంతో భారత్‌లో పెట్టుబడులపై విదేశీయులు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. దీంతో రూపాయి విలువ మరింత దిగజారనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 2, 3 స్థానాల్లో ఉన్న చైనా, జపాన్‌ కరెన్సీలు కూడా పతనమయ్యాయి. దీంతో ఆసియా మార్కెట్లు కూడా పడిపోయాయి. డాలర్‌ విలువతో పోలిస్తే ఆసియా కరెన్సీ మాత్రమే కాదు.. బ్రిటన్‌ పౌండ్‌, యూరో విలువ కూడా పతనమయ్యాయి. ప్రపంచ మార్కెట్‌ ఒడిదుడుకుల కారణంగా భారత స్టాక్‌ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. 1000 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ 57,100 వద్ద కొనసాగుతోంది.