రూ. 500 కోట్ల స్కామ్, చంద్రబాబు అరెస్టుపై సీఐడీ ప్రెస్ మీట్
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి ఏపీ సిఐడి అడిషనల్ డీజీ సునీల్ మీడియాకు వివరించారు. నిధులు కాజేసేందుకే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, సూత్రధారులు, పాత్రధారులు అనేక మంది ఉన్నారని ఆయన చెప్పారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు దగ్గర్నుంచి, నిధులు కొట్టేసే వరకు అంతా పర్ఫెక్ట్ స్కెచ్ ప్రకారం జరిగాయన్నారు. గంటా సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టడం వెనుక అవినీతి ఉందని ధ్వజమెత్తారు. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని మీడియాకు వివరించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు దారి తీసిన పరిస్థితులకు సంబంధించి సిఐడి ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రభుత్వ సొమ్మును, షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్‌ల ద్వారా మళ్లించినట్టు తేలిందన్నారు సీఐడీ బాస్. బాబు హయాంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు, షెల్ కంపెనీలకు తరలాయన్నారు. కేసులో డాక్యుమెంట్ల మాయం వెనుక చంద్రబాబు పాత్ర ఉందన్నారు. నిధులు ఎక్కడికి వెళ్లాయో తేలాలంటే చంద్రబాబు విచారణ తప్పనిసరి అని తెలిపారు. అధికారుల వాంగ్మూలాన్ని బట్టి స్కామ్ వెనుక సూత్రధారి చంద్రబాబు అని చెప్పారు సీఐడీ అడిషనల్ డీజీ సునీల్. క్యాబినెట్ ఆమోదం అనేది లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు సీఐడీ ధ్రువీకరించిందని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటుకు ముందే డిజైన్ టెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని, దర్యాప్తులో మొత్తం విషయం వెల్లడైందని ఆయన చెప్పారు. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ అమెరికాకు వెళ్లి, ఈ వ్యవహారంపై డీల్ కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటులో మాజీ మంత్రి, టీడీపీ యువనేత, నాారా లోకేష్ పాత్ర పైన విచారిస్తామని చెప్పారు. నిధుల మళ్లింపు సంబంధించి పూర్తి వివరాలను దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే మరిన్ని విషయాలు వెల్లడవుతాయన్నారు.

చంద్రబాబునాయుడు అరెస్టుకు సంబంధించి అనవసర దురుద్దేశాలను ఆపాదించవద్దని, తాము అంతా రూల్స్ ప్రకారమే చేస్తున్నట్టు సీఐడీ అడిషనల్ డీజీ సునీన్ వివరించారు. తాము చంద్రబాబునాయుడిని అర్ధరాత్రి ఇబ్బంది పెట్టలేదని రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొస్తున్నామని చెప్పారు. అరెస్టు సందర్భంగా నిబంధనలు పాటించామన్నారు. చాలా విస్తృతమైన దర్యాప్తు తర్వాత మాత్రమే చంద్రబాబు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. త్వరలో దుబాయ్‌లో ఉన్న మనోజ్‌ను ఇండియాకు తీసుకు వస్తామన్నారు ఈ స్కామ్ లో మరిన్ని వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

