తీవ్రగాయాలైతే రూ.50 లక్షలు, మృతులకు రూ.కోటి
అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన బాధితులకు ప్రభుత్వం ఊరటనిచ్చే పరిహారం ప్రకటించింది. మృతులకు రూ.కోటి, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి సాయాన్ని ప్రకటించారు. బాధితులకు ఎంత ఖర్చైనా సరే, ఉచితంగా వైద్యాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో బాధిత కుటుంబాలకు ఊరట లభించిందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫార్మా కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మూడు రోజులలోపే పరిహారం అందేలా చూస్తామన్నారు. ఈ ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స కొనసాగుతోంది.