Andhra PradeshHome Page Slider

రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం- ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్

సీఎం జగన్ విజ్ణప్తి మేరకు 46 దేశాల ప్రతినిధుల రాక

14 కీలక రంగాల్లో పెట్టుబడులపై దృష్టి

పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా సహకారం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలోని జీఐఎస్ వేదిక వద్ద గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. “ఏపీ ప్రభుత్వం తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. ఇప్పటికే Advantage.ap.in లో 14వేల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. వచ్చే డెలిగేట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒకరోజు ముందుగానే రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడం జరిగింది. ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్స్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రానున్నారు. రాబోయే ప్రముఖుల అందరి సమక్షంలో ఇనాగురల్ సెషన్ రేపు 2 గంటల ఉంటుంది. అదేవిధంగా రేపు కొన్ని ఎంవోయూలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన 150 పై చిలుకు స్టాల్స్ కు సంబంధించిన ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోపాటుగా, సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించి సెక్టరల్ సెషన్స్ కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ వారితో బ్యాక్ టూ బ్యాక్ మీటింగ్ లో పాల్గొంటారు.” అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.