వాట్సాప్ వీడియోకాల్‌తో విశ్రాంత ఉద్యోగి వద్ద రూ.19 లక్షలు చోరీ
హైదరాబాద్‌లో వాట్సాప్ వీడియోకాల్‌తో ఘరానా మోసం జరిగింది. ఒక విశ్రాంత ఉద్యోగి వద్ద సైబర్ నేరస్థులు వాట్సాప్ వీడియోకాల్‌తో మోసం చేసి, అతని అకౌంట్ నుండి 19 లక్షల రూపాయలు మాయం చేశారు. విశ్రాంత ఉద్యోగి గత వారం ఇంటర్ నెట్‌లో బ్యాంకు కస్టమర్ కేర్ సెంటర్ ఫోన్ నెంబరు కోసం ప్రయత్నించి, విఫలమయ్యారు. అయితే అది ఫేక్ వెబ్‌సైట్. కొంత సేపటికే అతనికి బ్యాంకు అధికారులమంటూ ఒకరు ఫోన్ చేశారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని నమ్మబలికి వీడియోకాల్ చేశారు. అతడికి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఒక యాప్ డౌన్‌లోడ్ చేయించారు. దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు వాట్సాప్‌లో తెప్పించుకున్నారు. తద్వారా అతని ఖాతా వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజుల అనంతరం చూస్తే అతని ఖాతా నుండి దఫదఫాలుగా రూ.19.23 లక్షలు వేరు వేరు ఖాతాలకు జమ అయినట్లు ఫోనుకు సందేశాలు వచ్చాయి. దీనితో తాను మోసపోయినట్లు తెలుసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

