‘మొహర్రం’ పర్వదినాన అంగరంగ వైభవంగా నెల్లూరులో ‘రొట్టెల పండుగ’
నెల్లూరులోని స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ సందడి మొదలయ్యింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రొట్టెలను పంచుకుంటున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా కూడా ఈ పండుగను చెప్పుకోవచ్చు. ఇది ముస్లింల పండుగే అయినా అన్ని మతాల వారు ఈ పండుగలో పాల్గొంటారు. ఇక్కడ రొట్టె మార్చుకున్నా, పట్టుకున్నా కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.

దాదాపు నాలుగువందల సంవత్సరాల క్రితం మహ్మద్ ప్రవక్త అనుచరులు 12 మంది ప్రజలకు బోధనలు చేస్తూ నెల్లూరు వచ్చారట. అయితే అప్పట్లో ఒక పవిత్ర యుద్ధం జరిగిందని వీరందరూ మరణించారని అక్కడి వారు చెప్తుంటారు. వీరి తలలను నెల్లూరు స్వర్ణాల చెరువు వద్దకు గుర్రాలు తీసుకుని వచ్చాయని అందుకే వారిని ఇక్కడ సమాధి చేసారని ఇక్కడి దర్గా స్థల పురాణం చెప్తోంది. వీరికి ‘బారా షహీద్’ అనే పేరు వచ్చింది. మొహర్రం తర్వాత మూడోరోజు ఒక్కరోజే ఇక్కడ రొట్టెల పండుగ జరిగేది. రాను రాను దీనికి ప్రాచుర్యం రావడంతో మొహర్రం రోజు నుంచి మూడు రోజులు పండుగ జరిపేవారు. అదికాస్త ఐదురోజులకు మారింది.

విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, ధన, గృహం వంటి కోరికలతో రొట్టెలు వదలడం, పట్టుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ ఏడాది ఓ కోరిక కోరుకుని రొట్టె పట్టుకునే వారు ఆ కోరిక తీరాక ఆ రొట్టెను తిరిగి వదలాలి. అలా ఈ ఏడాది తీసుకున్న రొట్టెను మరో ఏడాది కోరిక తీరాక వదులుతారు. ముందుగా బారాషహీదులను దర్శించుకున్న తర్వాత స్వర్ణాల చెరువులోకి వెళ్లి మోకాలి లోతు నీళ్లల్లో తలపై నీళ్లు చల్లుకుని రొట్టెలు మార్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగ కోసం దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. ముఖ్యంగా కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు.