NationalNews

బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ..?

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ తరుణంలో గంగూలీ వారసుడిగా బీసీసీఐ పగ్గాలు ప్రస్తుత కార్యదర్శి జై షా చేతికి వస్తాయనే వార్తలొచ్చాయి. అయితే.. క్రికెట్‌లో అనుభవం లేని జై షా.. తన తండ్రి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అండతో బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగడంపై క్రికెట్‌ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ తరుణంలో బీసీసీఐ అధ్యక్షుడిగా కొత్త పేరు బయటికొచ్చింది. అతడే 1983 ప్రపంచ కప్‌ హీరో రోజర్‌ బిన్నీ.

బిన్నీ పేరు అకస్మాత్తుగా ప్రత్యక్షం..

ఈ నెల 18వ తేదీన జరిగే బీసీసీఐ ఎన్నికలు, వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొనే ఓటర్ల జాబితాలో కర్నాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం తరఫున రోజర్‌ బిన్నీ పేరు అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. గతంలో ఉన్న సంతోష్‌ మీనన్‌ స్థానంలో స్కాటిష్‌ మూలాలున్న ఆంగ్లో-ఇండియన్‌ బిన్నీ ఆల్‌రౌండర్‌గా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1983 వరల్డ్‌ కప్‌లో అత్యధిక వికెట్లు (18 వికెట్లు) పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు బీసీసీఐ రేసులో ప్రత్యక్షమయ్యాడు.

ఈ నెల 18న బీసీసీఐ ఎన్నికలు..

బీసీసీఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శ, కోశాధికారి పదవులకు ఈ నెల 11, 12 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన, 14న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 18వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలో బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిగా నియమించాలని.. కార్యదర్శిగా జై షాను కొనసాగించాలని ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. బిన్నీ అధ్యక్షుడిగా ఉన్నా.. బీసీసీఐలో చక్రం తిప్పేది మాత్రం జై షా మాత్రమేనని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కనుసన్నల్లోనే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు పని చేస్తుందన్నమాట.