NationalNews

కశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం.. కడపవాసి సహా ఆరుగురు జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసులు (ITBP) ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందగా మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అమర్‌నాథ్ యాత్రకు భద్రత కోసం జవాన్లుకు ఏర్పాటు చేసిన ఈ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పహాల్గాం వద్ద నది లోయలో పడిపోయింది.

బస్సులో మొత్తం 39 మంది జవాన్లు ఉన్నారు. అందులో ఇద్దరు జమ్మూకాశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన వారు. ఐతే మరణించిన జవాన్లలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన రాజశేఖర్ కూడా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఐటీబీపీ కానిస్టేబుల్ రాజశేఖ‌ర్ మృతితో క‌డ‌ప జిల్లాలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. మృతులను హెడ్ కానిస్టేబుల్ దులా సింగ్ (తరణ్ తరణ్, పంజాబ్), కానిస్టేబుల్ అభిరాజ్ (లఖిసరాయ్, బీహార్), కానిస్టేబుల్ అమిత్ కుమార్ (ఈటీఏ, యూపీ), కానిస్టేబుల్ డి. రాజశేఖర్‌ (కడప, ఆంధ్రప్రదేశ్ ), కానిస్టేబుల్ సుభాష్ బైర్వాల్ (సికార్, రాజస్థాన్), కానిస్టేబుల్ దినేష్ బోహ్రా (పితోరాఘర్, ఉత్తరాఖండ్), కానిస్టేబుల్ సందీప్ కుమార్ (జమ్మూ డివిజన్)గా గుర్తించారు.