రైతులను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు . మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ , తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తప్పడు హామీలతో కాంగ్రెస్ దొంగదారిలో అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని అర్వింద్ మండిపడ్డారు.
భీకర వర్షాల కారణంగా రాష్ట్రంలో పంటలు నష్టపోయినా, వరద బాధితులను ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశాన్ని ప్రస్తావించిన ఆయన, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణకు ఆదేశాలు జారీ చేసి, నిధులు విడుదల చేసినా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో ఏమాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాటాలు పొందుతున్నందువల్లే ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపై మౌనం వహిస్తున్నారని ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు.