Telangana

మునుగోడు బ్యాలెట్ పేపర్ పై రేవంత్ రెడ్డి అభ్యంతరం

మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం నిమగ్నమైంది. బ్యాలెట్ పేపర్‌ను రూపొందించింది. అయితే దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్ మార్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అందుకు కారణం.. రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉండటమే. మునుగోడు బ్యాలెట్ పేపర్ నమూనాను రిటర్నింగ్ అధికారి విడుదల చేశారు. బ్యాలెట్ పేపర్‌లో మొదటి స్థానంలో బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారి ఉండగా… రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాలుగో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఉన్నారు. బ్యాలెట్ పేపర్ కూర్పుపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు ముందు ఉంచాలని, ఆ తర్వాతే ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు, ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి పేరు నాలుగో స్థానంలో ఉండాలని నిబంధనలకు విరుద్ధంగా రెండో స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పేరును ఎలా ఉంచారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా నిబంధనలను మరోమారు పరిశీలించి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల పేరును నాలుగో స్థానానికి మార్చాలని డిమాండ్ చేశారు.